ఓ యువ నిర్మాత కమ్ దర్శకుడు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన కలకలం రేపింది. తానే నిర్మాతగా మారి సొంతంగా నిర్మించిన ఆ చిత్రం ఎంతకీ విడుదలకాక పోవడంతో మనోవేదనకు గురయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బెంగళూర్ నందినీ లేఔట్ కు చెందిన శశికుమార్ రెండు సంవత్సరాల ఓ సినిమాను ప్రారంభించాడు. సందీప్ అనే కొత్త కుర్రాడు హీరోగా కన్నడలో 'ఆఫ్ మెంటల్' అనే సినిమాను పూర్తిచేశాడు. దానికి ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. మొత్తం 3.25 కోట్లు వెచ్చించి సినిమా పూర్తి చేశాడు. అది పూర్తయ్యి సంవత్సరం గడుస్తోంది. అయితే ఫైనాన్స్ ప్రాబ్లమ్ తో సినిమా విడుదల ఆగిపోయింది.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన దర్శకుడు కారులో స్థానిక కామాక్షి పాళ్య బస్టాండు సమీప ప్రాంతానికి వెళ్లి వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ లో పురుగుల మందు కలుపుకుని తాగాడు. అప్పుడే భార్య ఫోన్ చేయగా ఆత్మహత్యకు చేసుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో భార్య కిరణ్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడారు. సినిమా విడుదలకాకపోవడం వల్లే ఆత్మహత్యకు ప్రయత్నించానని అసలు విషయం చెప్పాడు. సినిమా విడుదలకు 80 లక్షలు అవసరమవుతుందని, అంత మొత్తంలో డబ్బు లేక ఆత్మహత్యకు యత్నించినట్లు శశికుమార్ తెలిపారు.