తెలుగు సినిమాల విడుదలకు ఓ పద్ధతి ఉంది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యే టైంలో ఆడియోను విడుదల చేసి, అవి బాగా వైరల్ అయ్యేలోపు ప్యాచప్ వర్క్ లు పూర్తి చేసి, విడుదల తేదీ అనౌన్స్ చేసి ఓ రెండు రోజుల ముందు సెన్సార్ కి పంపి, ఆపై విడుదల చేయటం పరిపాటి. అయితే ఓ భారీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం మాత్రం చడీచప్పుడు లేకుండా సెన్సార్ పూర్తి చేసుకోవటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగ్-కార్తీ కాంబోలో వస్తున్న ఊపిరి చిత్ర విషయంలో ఇదే జరిగింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ తమిళంలో రెండు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా పూర్తయ్యిందట. అంతేకాదు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ అయ్యింది. ఇక ఈ చిత్ర తమిళ ఆడియోను ఫిబ్రవరి 26, తెలుగులో ఫిబ్రవరి 28న నిర్వహిస్తారని తెలుస్తోంది. మార్చి 25న ఒకేసారి అక్కడా, ఇక్కడా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో మాత్రం రెగ్యులర్ గా రెండు రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసుకుంటుందట.
ఇక్కడ సమస్య ఏంటంటే... సోగ్గాడే చిన్నినాయనా లాంటి భారీ హిట్ తర్వాత వస్తున్న నాగ్ చిత్రం కావటం, పైగా కార్తీ లాంటి యంగ్ హీరోతో కలిసినటిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి.. అయితే తమిళ్ వర్షన్ పై పెడుతున్న శ్రద్ధ తెలుగు పై పెట్టడం లేదన్నది ఇప్పుడు వినవస్తున్న వాదన. కార్తీ, తమన్నా లకు కోలీవుడ్ లో బాగా పేరు ఉండటంతో ప్రచారం అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు పీవీపీ ప్రకటించింది. అయితే కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం తీసుకుంటేనే తప్ప విషయాలేవీ బయటికి రాకపోవటం మాత్రం మరీ దారుణం. టాలీవుడ్ కోసం ఓ ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేస్తే బెటర్ అన్నది సినీ పాత్రికేయుల వాదన.