హుదూద్ బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన 'మేము సైతం' కార్యక్రమం ద్వారా సినీ పెద్దలు పూర్తిస్థాయి ప్రాంతీయతత్వాన్ని మరోమారు ప్రదర్శించారని తెలంగాణకు చెందిన నిర్మాత, దర్శకుడు రఫీ ఆరోపించారు. బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం తప్పుకాదని... అయితే కేవలం తమ ప్రాంతానికి వారికి మాత్రమే సహాయం చేస్తామనే విధంగా ప్రవర్తించడమే దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ గడ్డపై సినిమాలు నిర్మించి, నిర్మిస్తూ లాభలు ఆర్జించిన వారికి ఇక్కడి ప్రజల కష్టాలు పట్టావా ?అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు అర్పించారని, అలాగే ప్రస్తుతం రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెబుతూ... మరి వీరందరినీ ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రాలేదంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ చేసిన సాయం వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు. పనిలో పనిగా హైదరాబాదులోని కేబీఆర్ పార్కుకు కేసీఆర్ పార్క్ అని నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమ నేతగా కేసీఆర్ చేసిన కృషి వల్లే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రఫీ తెలిపారు.