షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వార్తల్లో నిలిచి విడుదలై 8 నెలలు గడుస్తున్న ఇంకా బాహుబలి ఫీవర్ తగ్గలేదు. విడుదల తేదీ తెలీకపోయినా రెండో పార్ట్ షూటింగ్ దశలో ఉండి అంచనాలను మరింత పెంచుతోంది. ఇక ప్రీ బిజినెస్ నుంచి ప్రారంభమైన కలెక్షన్ల వరద విడుదలయ్యాక కూడా కొనసాగింది. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఈ తెలుగు సినిమా మరో రికార్డుకు చేరవలో ఉంది. బాహుబలి చైనా వెర్షన్ ను మే నెలలో భారీగా విడుదల చేస్తున్నారు. మొత్తం 6000 థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రముఖ పంపిణీ సంస్థ 'ఈ-స్టార్స్' చైనా ప్రదర్శన హక్కులను పొందింది. గతంలో అమీర్ 'పీకే'ను ఈ సంస్థ అక్కడ 5000 థియేటర్లలో రిలీజ్ చేయగా, ఇప్పుడు 'బాహుబలి'ని అదనంగా మరో వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తుండడం విశేషం. ఇలాంటి జానపద కథా చిత్రాలు చైనీయులను బాగా అలరిస్తాయని సదరు సంస్థ భావిస్తోంది. అందుకే, భారీ ఎత్తున రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకుంటోంది. కలెక్షన్ల పరంగా పీకే రికార్డును కొల్లగొట్టిన బాహుబలి, ఎక్కువ థియేటర్లలో రిలీజై మరి చైనాలో కూడా పీకే కలెక్షన్లను కొల్లగొడుతుందేమో చూడాలి.