బడా సినిమాలు థియేటర్లలో ఆడినా ఆడకపోయినా... టీవీల్లో మాత్రం వాటి క్రేజ్ తగ్గదనే చెప్పాలి. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త చిత్రాలు టెలివిజన్లలో ప్రసారం అవుతున్నాయంటే చాలు జనాలు వాటికి అతుకుపోయి మరీ చూస్తుంటారు. ముఖ్యంగా రెండు, మూడు నెలలు కూడా నిండని చిత్రాలు వేస్తున్నారంటే చాలు ఎలాగూ థియేటర్లలో చూడలేకపోయాం కదా, కనీసం బుల్లి స్క్రీన్ పైన అన్న చూసేద్దాంలే అన్న కోరికే ప్రజల్ని టీవీలకు కట్టేసుకునేలా చేస్తుంది. దీనిని బాగా వాడుకోవాలని ఛానెల్ లు కూడా పోటీ పడి మరీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంటాయి. ఇక ఈ వ్యవహారంలో ఇప్పుడు జెమినీ టీవీ గురించి చెప్పుకొవాలి. ఒకప్పుడు సినిమా శాటిలైట్ రైట్స్ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపని జెమినీ టీవీ ఇప్పడు మిగతా చానెళ్లతో పోటీ పడి మరీ కొత్త సినిమాల హక్కులను కొంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ 1 చిత్రంతో బోణీ ప్రారంభించిన ఈ చానెల్ ఇప్పుడు వరుసబెట్టి శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడుతుంది. సురేష్ ప్రోడక్షన్ లో ఏకంగా మూడు చిత్రాలను రూ.20 కోట్లకు కొనుగోలు చేసి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకీ-పవన్ కాంబినేషన్లో రాబోతున్న గోపాల గోపాల చిత్రంతోపాటు ద్రుశ్యం, భీమవరం బుల్లోడు చిత్రాలను ఇంత భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇందులో సునీల్ భీమవరం బుల్లోడు ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ రూ.3 కోట్లతో ఈ చిత్ర ప్రసార హక్కులను జెమిని పొందింది. అంతేకాదు అంతంత మాత్రంగా ఆడిన మంచు మనోజ్ కరెంట్ తీగ చిత్రాన్ని కూడా రూ. 4 కోట్లకు కొనుగొలు చేసింది. ఇక యంగ్ టైగర్ లేటెస్ట్ డిజాస్టర్ రభస చిత్రాన్ని విడుదలకు ముందే రూ.8 కోట్లకు కొనుగొలు చేసి ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ చిత్రం ఈ ఆదివారం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. హిట్ సినిమాల సంగతి ఏమో కానీ, కనీసం కొన్ని రోజులు కూడా థియేటర్లలో ఆడని చిత్రాల హక్కులను కొనుగొలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మరీ జనాలను కనీసం థియేటర్ల వరకు కూడా రానివ్వని ఈ చిత్రాలు బుల్లి స్ర్కీన్ లో అయిన సక్సెస్ అయి ఛానెల్ కు లాభాలు తెచ్చిపెడతాయో లేదో వెయిట్ అండ్ సీ.