భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన సినిమా ‘రుద్రమదేవి’. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. షూటింగ్ పూర్తయ్యే సమయానికే పలు విభాగాలకు సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుండడంతో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనులతో పాటు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాదనే తెలుస్తోంది. దానికి కారణం ఎక్కువగా 3డి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉండడమే అని అంటున్నారు. 3డి వర్క్ అనేది బాగా కష్టంతో కూడుకున్న పని, అలాగే ఎక్కువగా స్పెషల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉండడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరికొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.