తమ డిమాండ్ల పరిష్కారం కోసం 24 విభాగాలకు చెందిన దాదాపు 14వేల మంది కార్మికులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో షూటింగ్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అగ్రిమెంట్ల వివాదాల పరిష్కారానికి నిర్మాతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో వర్కర్స్ సమ్మె విరమించారు. శనివారం నుంచి షూటింగ్‌లకు హాజరవుతున్నారు. వేతనాల విషయంలో ఎలాంటి విభేదాలు లేకున్నా కొన్ని అగ్రిమెంట్లకు సంబంధించి నిర్మాతల మండలికి, కార్మికుల మధ్య వివాదం మొదలైంది. ఈ విషయంలో కార్మికులు తమ పంతం నెగ్గించుకున్నారు. గుర్తింపు పొందిన ఆరు కార్మిక యూనియన్లతోనే పనులు చేయించుకోవాలని, ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకోకూడదన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. దీన్ని నిర్మాతల మండలి తోసిపుచ్చింది. అలాగే చిన్న సినిమాల విషయంలో క్లారిటీ ఇవ్వాలని పట్టుబట్టారు. సినిమా పెద్దదైనా, చిన్నదైనా తాము ఒకేరకంగా కష్టపడతామని, దానికి తేడాలు ఎందుకు చూపిస్తున్నారో తెలపాలని వర్కర్స్ ప్రశ్నించారు. ఈ విషయంలో ఎవరి వాదనలకు వాళ్లే కట్టుబడి వుండడంతో బెట్టు వీడలేదు. పరిస్థితి గమనించిన ఫిల్మ్ ఛాంబర్, ఇరువర్గాలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించింది. తమ డిమాండ్లను నిర్మాతలు అంగీకరించడంతో కార్మికులు ఆనందం వ్యక్తంచేశారు. కార్మికులు సమ్మె విరమించడంతో శనివారం నుంచి షూటింగ్‌లు మొదలయ్యాయి.