బంగ్లా చేతిలో ధోనీసేన భంగపాటు

June 18, 2015 | 11:24 PM | 0 Views
ప్రింట్ కామెంట్
india_vs_bangladesh_first_odi_lost_niharonline

బంగ్లాదేశ్ చేతిలో భారత్ కు దారుణమైన పరాభవం ఎదురైంది. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ ‘నోబాల్’ ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై అతి పెద్ద విజయాన్ని సాధించింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు... ముస్తఫిజుర్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌లో పండగ వాతావరణాన్ని సృష్టించాడు.  మిర్పూర్: ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ ఆటతీరును చూసిన తర్వాత ఆ జట్టును టీమిండియా తక్కువగా అంచనా వేయలేదు. అందుకే ఈ సారి పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌కు సిద్ధమైంది. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. బంగ్లా అద్భుత ప్రదర్శన ముందు ధోని సేన తలవంచింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (62 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (40 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు పడ్డాయి. భారత్ 46 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రైనా (40 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగి ముస్తఫిజుర్ (5/50) సంచలన బౌలింగ్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇక్కడే ఆదివారం జరుగుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ