ఆయన ప్రధానిగా కొనసాగితే అంతేనంటున్న ఆమ్నెస్టీ

February 25, 2015 | 01:26 PM | 72 Views
ప్రింట్ కామెంట్
amnesty_criticises_modi_government_niharonline

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖ్యాతి గురించి దేశీయ మీడియానే కాదు అంతర్జాతీయంగా కూడా ఏ రేంజ్ లో ఊదరగొట్టాయో తెలిసిన విషయమే. మహా మహా దేశాధ్యక్షులు కూడా మోదీ కరచలనం కోసం ఎగబడ్డారనే కథనాలు దేశ ప్రజలకు వినసొంపుగానే అనిపించాయి. ప్రధాని పీఠం అధిరోహించక ముందు నుంచే ప్రారంభమైన ఈ డప్పు రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన అయ్యేదాకా వాయిస్తూనే ఉన్నాయి. అయితే దేశ ప్రజలే కాదు మీడియా సైతం విస్తూపోయే ఓ విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే దేశంలో జాతి వైరాలు ఎక్కువవుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా దేశంలో చాలామంది భారతీయులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనున్నట్లు పేర్కొంది. అంతేకాదు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పలు హింసాత్మక ఘటనలు పరిశీలనలోకి తీసుకున్న ఆమ్నేస్టీ షాక్ గురయ్యే విషయాన్ని తెలిపింది. ఇవన్నీ కూడా కార్పోరేట్ ప్రాజెక్టుల నేపథ్యంలో జరిగినవేనని సంస్థ పేర్కొంది. ఆయా ప్రాజెక్టు నిర్మించే క్రమంలో అక్కడి వారిని సంప్రదించకుండా ఉండటం వల్ల వర్గాలుగా ఏర్పడి ఘర్షణలు తలెత్తుతున్నాయని తెలిపింది. సుస్థిరమైన, సురక్షితమైన పాలనను అందిస్తానని, మెరుగైన వసతులు కల్పిస్తానని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ మాట తప్పారంది. ఎవ్వరినీ సంప్రదించకుండానే ప్రాజెక్టులు పూర్తి చేసేలా, కార్పొరేట్ సంస్థలకు తలొగ్గేలా ఆయన పనిచేస్తున్నారని విమర్శించింది. ప్రస్తుతం భూసేకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమ్నెస్టీ నివేదిక ప్రతిపక్షాల చేతికి పదునైన ఆయుధంగా దొరికినట్టయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ