ఐఎస్ఐఎస్ ఉగ్రవాదలపై ఇరాక్ సైన్యం విరుచుకుపడింది. అన్బార్, నినేవ్, సలాహుదీన్ ప్రావిన్స్ ల్లో సైన్యం ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై దాడులు చేసింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో మంగళవారం వారి వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా, కొందరు సైనికులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు రెండు ఫ్యూయెల్ ట్యాంకులను తీసుకెళ్తుండగా వాటిని సైన్యం ధ్వంసం చేసింది. దీంతోపాటు పలు ఆయుధ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ బలగాలు దాడులు పసిగట్టి తిప్పికొట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేసినప్పటికీ సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొంది. ఇరాక్ లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు అమెరికా సహాయం చేస్తోంది. ఇందుకోసం తమ దేశం తరపున యుద్ధవిమానాలను, ఆయుధాలను ఇరాక్ కు అందిస్తోంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే వరకు విశ్రాంతి లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన రెండు రోజులకే ఈ తరహా దాడులు జరగటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.