భారీ భూకంపంతో దెబ్బతిన్న నేపాల్ తిరిగి మాములు జీవితం ప్రారంభించే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రకృతి భీభత్సం తర్వాత గురువారం ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ నష్ట వివరాలను అధికారికంగా వెలువరించింది. రిక్టర్ స్కేలుపై 7.9 నష్ట తీవ్రతతో వచ్చిన భూకంపానికి అక్కడ 2,79,234 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 2,37,068 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే, విలయానికి 7,757 మంది చనిపోగా, 16,390 మంది క్షతగాత్రులుగా మారారు. బుధవారం దాకా సుమారు 12 దేశాలకు చెందిన 600 సహాయక బృందాలు నేపాల్ నుంచి స్వదేశాలకు తరలివెళ్లిపోయారిన తెలిపారు. కాగా, భూకంప ధాటికి తీవ్రంగా నష్టపోయిన నేపాల్ మారుమూల ప్రాంతాలు ఇంకా సహాయక చర్యలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. నేపాల్ వ్యాప్తంగా సహాయక చర్యల్లో పోలీసులతోబాటు, ఆర్మీ కూడా పాలుపంచుకుంటోంది.