మిడిల్ ఈస్ట్ రెస్పిరెటరీ సిండ్రోమ్... ఎంఈఆర్ఎస్ (మెర్స్) అని పిలుచుకునే మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంది. కరోనా వైరస్ కారణంగా వ్యాప్తించెందుతోంది. మొదటగా దీన్ని సౌదీ అరేబియాలో గుర్తించారు. ఆ తర్వాత మధ్య ప్రాచ్యం, దక్షిణ ఆసియా దేశాలను గడగడలాడించిందీ వైరస్. ఈజిప్ట్, టర్కీ, అల్జీరియా, ఒమన్, యూఏఈ, జోర్డాన్, మలేషియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా తదితర దేశాల్లో పంజా విసిరింది. తాజాగా ఇప్పుడు దక్షిణ కొరియాలో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మరణించారు. మరో పాతిక మందికి లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు అక్కడ ఇప్పుడు అత్యవసర వైద్య పరిస్థితిని ప్రకటించారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణహాని ఉండదట. కానీ, నిర్లక్ష్యం చేస్తే వారితోపాటు మిగతా వారిని బలి తీసుకునే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. అన్నట్టు కరోనా వైరస్ సోకితే లక్షణాలు అచ్చం స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయట. ఇటీవలె స్వైన్ ఫ్లూ ధాటికి ఇండియాలో జనాలు పిట్టల్లా రాలారు. ఇక ఇది కూడా మన దేశంలోకి ప్రవేశించిందంటే ఇక అంతే సంగతులు.