పొరుగు దేశం నేపాల్ ను భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం ఉదయం సంభవించిన ఈ భూకంపానికి భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. రాజధాని ఖట్మాండ్ తో సహా పలు ప్రాంతాల్లో ఈ భూకంపం బీభత్సం సృష్టించింది. ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ముఖ్యంగా లాంజంగ్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. దీని తీవత్రం రిక్టర్ స్కేలు పై 7.4 గా నమోదయి క్రమంగా 7.9 కి పెరిగింది. ఇక భూకంపం నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ ను, రవాణా వ్యవస్థలను స్తంభిపజేశారు. దీని తీవ్రత కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా పడటంతో టెలికమ్ సేవలు నిలిచిపోయాయి. కాగా ఇప్పటిదాకా ఎంతమంది మృతిచెందారో సమాచారం అందడం లేదు. అంతేకాదు ఈ ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించింది. వాతావరణ శాఖ నిపుణుల నివేదిక ప్రకారం... ఈ ఉదయం 11.44 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలు పై సుమారు 7.4 గా ఈ తీవ్రత నమోదయిందట. కానీ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా భూమి స్వల్ఫంగా కంపించినట్లు సమాచారం. ఇక ప్రకృతి విపత్తుపై భూకంపం పై ఎప్పటికప్పుడూ అధికారులతో మాట్లాడుతూ ఆరా తీస్తునట్లు ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.