అంతలా ఎందుకంటారా? ప్రస్తుతం బ్రిటన్ లో ఇప్పుడు కొన్ని గమత్తైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఓట్లేసి గెలిపించాలని అక్కడి నేతలంతా భారతీయుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సుమారు 6.20 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులకు ఓటు హక్కు ఉంది. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఈనేపథ్యంలో అక్కడ నేతలంతా కాళ్లరిగేలా భారతీయుల చుట్టూ ప్రధక్షిణలు చేస్తున్నారు. ఎంతలా అంటే స్వయానా ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం సీన్లోకి ఎంటరై, హామీల వర్షం కురిపిస్తున్నారట. గత ఎన్నికల్లో ఎన్నారైలలో అత్యధికులు లేబర్ పార్టీకి మద్దతుపలకగా, ఈ దఫా వారిపై ఆదరణ తగ్గిందని ముందస్తు సర్వేలు వెల్లడించాయి. మొత్తం 45 స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఇండియన్స్ ఉన్నారట. అందుకే అక్కడి నేతలు పడని పాట్లు లేవు. మాములు రోజుల్లో భారతీయుల హక్కులను పట్టించుకోని అక్కడి ప్రభుత్వం ఎన్నికలు వచ్చేసరికి ఇలా ప్రాధాన్యం ఇవ్వటంతో మనోళ్లు కూడా అస్సలు తగ్గట్లేదంట.