రంజాన్ వేళ ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం బాంబు పేలుడుతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం అర్థరాత్రి ఖాన్ బని సాద్ ప్రాంతంలోని ఓ మార్కెట్ వద్ద శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 80 మంది చనిపోయినట్లు సమాచారం. మరో 50 మంది గాయపడ్డట్లు భద్రతా దళాలు తెలిపాయి. అర్థరాత్రి దాటాక పేలుడు సంభవించటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంజాన్ పండగ కావటంతో వీధులన్నీ కిక్కిరిసిపోవటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలను, షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర పేలుడు తీవ్రత ప్రభావం చూపింది. పేలుడు జరిగిన దాదాపు గంట దాకా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాగా, పేలుడుకు బాధ్యత తామేనని ఐఎస్ ఉగ్రసంస్థ ప్రకటించింది. మార్కెట్లో ఆగి ఉన్న ఓ ట్రక్ ద్వారా పేలుడుకి పాల్పడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో మరిన్నీ పేలుళ్లకు అవకాశం ఉన్నట్లుగా అనుమానిస్తూ... భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి.