విషాదకర పరిస్థితుల్లో మరణించిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫిలిప్ హ్యస్ కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నివాళులర్పించాడు. బ్యాట్లతో హ్యూస్ కు నివాళులర్పించాలంటూ 'పుట్ యువర్ బ్యాట్స్ అవుట్' ట్విట్టర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సచిన్ కూడా తన బ్యాట్ ను ఇంటి ముందు ఉంచాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఫొటో పెట్టాడు. అది తాను పాతికేళ్ల వయసులో ఉపయోగించిన బ్యాట్ అని సచిన్ ట్వీట్ చేశాడు. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించాడు. అటు, 'పుట్ యువర్ బ్యాట్స్ అవుట్' ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, అన్ని కేటగిరీలకు చెందిన క్రికెటర్లు తమ బ్యాట్లతో ఆసీస్ యువకిశోరానికి నివాళులర్పించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కూడా బ్యాట్, గ్లోవ్స్ వెలుపల ఉంచి నివాళి తెలిపాడు. ఇక సచిన్ నివాలుర్పించిన విషయంలో ఓ ఆంగ్ల దినపత్రికలో పొరబాటు దొర్లింది. విషయం ఏమిటంటే... హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని సచిన్ ట్వీట్ చేస్తే, సచిన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రచురించారు. దీంతో, మాస్టర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. 'ఆ పత్రిక ఆత్మకు శాంతి కలుగుగాక' అంటూ ట్వీట్లతో తిట్ల వర్షం కురిపించారు.