తెల్లవారు ఝామున జరిగిన ఆ ఘోర ప్రమాదం దాదాపు 100 మంది ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 90 కి పైగా దుర్మరణం పాలు కాగా, 85 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రలోని జబువాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పేలుడు శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జరిగింది. జుబవాకు 60 కిలోమీటర్ల దూరంలో గల పెట్లవాడ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం కావటం. పైగా సెంటర్ లోని హోటల్ కావటంతో టిఫిన్ చేసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అయితే వంట చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందా, లేదా గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందా అనేది సరిగ్గా తెలియడం లేదు. పెద్ద శబ్ధంతో భవనం కుప్పకూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న భవనాలు కూడా బీటలు వారాయి. సహాయక చర్యల కోసం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంతర్ సింగ్ ఆర్యా సంఘటనా స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది.