ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే డిపెండింగ్ చాంపియన్ టీమిండియా ప్రాబబుల్స్ ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. మొత్తం 30 మందితో కూడిన జట్టును సెలక్ట్ చేసింది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహించనుంది. టీంలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఊతప్ప, మురళీవిజయ్, పాండే, పుజారా, ఉన్ముక్ చంద్ తదితర 11 మంది బ్యాట్స్ మెన్ టీంలో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు వికెట్ కీపర్లలో ధోని, సాహా, శాంసన్ వున్నారు. భువనేశ్వర్, వరుణ్ ఆరోన్, ఇశాంత్, ఉమేష్‌లతోసహా 10 మంది మీడియం పేసర్లలు ఉన్నారు. నలుగురు స్పిన్నర్లలో అశ్విన్‌తో పాటు అమిత్ మిశ్రా చోటు దక్కించుకున్నాడు. ఇద్దరు ఆల్ రౌండర్లు టీమ్‌లో వున్నారు. అంతా అనుకున్నట్లు ఐదుగురు సీనియర్లకు బోర్డు మొండి చేయి చూపిచింది. జహీర్ ఖాన్ తోపాటు వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్ సింగ్, గంభీర్, హార్భజన్ సింగ్ లకు చోటుదక్కలేదు. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగస్వాములైన ఈ ఐదుగురిని పక్కన పెట్టడంతో ఇక వీళ్ల కెరీర్ కు శుభం కార్డు పడ్డటేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాబబుల్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడి గురించి. అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకునే ఈ బ్యాట్స్ మెన్ కి ప్రాబబుల్స్ లో చోటు దక్కడం మంచి పరిణామమే అని చెప్పాలి. ప్రాబబుల్స్ ను పరిశీలిస్తే బోర్డు అంచనాలకు అనుగుణంగా ఆడే యువతకే పెద్ద పీట వేశారు.