ఉత్తర ప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆజం ఖాన్ పై చర్యలకు ఉపక్రమించాల్సిందిగా బీజేపీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సూచించింది. వివాదాలకు కేంద్ర బిందువైన ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సారి ఆయన నోరుపారేసుకున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కావడం గమనార్హం. హంతకుడిని మీడియా ప్రధాన మంత్రిని చేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మోరాదాబాద్ వెళ్లిన ఆజం ఖాన్ అక్కడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సంగతి తెలిసిందే. నాటి ఘటనను దృష్టిలో పెట్టుకునే ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొరాదాబాద్ లోని మైనార్టీ వర్గాల్లో విద్యపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొన్న ఆజం ఖాన్ మోదీపై విరుచుకుపడ్డారు. మోదీతో పాటు ఆయన సన్నిహితుడిగా పేరు పడ్డ పారిశ్రామికవేత్త గౌతం ఆదానీపై కూడా ఆజం ఖాన్ విమర్శలు గుప్పించారు. ఇక ఈ విమర్శలపై బీజేపీ నాయకత్వం గుస్సాతో ఉంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని అఖిలేష్ ప్రభుత్వానికి తెలిపింది.