గోవాలో మాదకద్రవ్యాల వినియోగ తీవ్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పందించారు. కొందరు పర్యాటకులు డ్రగ్స్ కోసమే గోవా వస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు తన 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో డ్రగ్స్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిపై పర్సేకర్ స్పందిస్తూ, "గోవాలో మాదకద్రవ్యాల వాడకం లేదనడంలేదు. డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయాలని కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో పోలీసులు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు" అని వివరించారు. కేవలం డ్రగ్స్ కోసమే గోవా వచ్చే పర్యాటకులతో ప్రభుత్వానికేమీ ఆదాయం లభించదని, వాళ్లు దివాలాకోరులని పేర్కొన్నారు. ఇలాంటి వారితో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. పర్సేకర్ ఓ ప్రశ్నకు బదులిస్తూ, గోవాలాంటి రాష్ట్రం డ్రగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో నిజం ఉందన్నారు.