దురంతో ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం... 10 మంది మృతి?

September 12, 2015 | 10:54 AM | 3 Views
ప్రింట్ కామెంట్
duranto-express-accident-in-bangalore-niharonline

పొద్దు పొడిస్తే చాలు ఏ ఘోరం వినాల్సి వస్తుందో అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా వరుస ఘోర రైలు ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం అర్థరాత్రి కర్నాటకలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన దురంతో ఎక్స్ ప్రెస్ గుల్బార్గా  సమీపంలోని వర్తూరు వద్ద పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు పల్టీలు కొట్టాయి. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినట్లు తొలుత అధికారులు వెల్లడించారు. కానీ, ఇప్పటిదాకా 10 మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని గుల్బర్గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ అమిత్‌సింగ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి...హుటాహుటిన గుల్బార్గా ఆసుపత్రికి తరలించారు.

                                        శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి కుర్లాకు 11గంటలకు దురంతో ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌...వర్తూరు స్టేషన్‌ దగ్గరకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో 4బోగీలు పల్టీలు కొట్టాయి. ఆసయమంలో ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉన్నారు. భారీ శబ్దం రావడంతో... ప్రయాణీకులంతా భయంతో వణికిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే బోగీలు చెల్లచెదురుగా పడిపోయాయి. ముంబై నుంచి చెన్నై మార్గంలోని రైళ్లన్నీ రద్దు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు దీని వెనుక కుట్ర దాగుందా అన్న కోణంలో అనుమానాలు రెకెత్తుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ