మగువలకు అందంగా కనిపించాలనే తాపత్రయం ఎక్కువే ఉంటుంది. ఇందుకోసం సమయంతో పాటు డబ్బును కూడా లెక్కచేయరనటంలో ఆశ్చర్యం లేదండోయ్... ఇంట్లోనే తయారు చేసుకునే సౌందర్య పద్ధతులను పాటిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుకునే వారు కొందరైతే, బూ్యటీ పార్లర్ కి వెళ్లి అత్యాధునిక సాధనాలను ఉపయోగించి అందంగా కనిపించేందుకు మక్కువ చూపుతుంటారు.
ముంబయి, బెంగళూరు లాంటి మెట్రో నగరాలలో ఉన్న ఉన్నత శ్రేణి బ్యూటీ సెలూన్ల నిర్వాహకుల కథనం ప్రకారం గతంలో అయితే రెండు, మూడు నెలలకు ఒకసారి వచ్చే కస్టమర్లు, ప్రస్తుతం నెలలోనే రెండుసార్లు పార్లర్ కి తప్పనిసరిగా వస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. హెయిర్ స్టైలింగ్, నెయిల్ పాలిష్ వంటి వాటిపై టీనేజ్ అమ్మాయిలతో పాటు 25 సంవత్సరాల పైబడిన మహిళలు కూడా తమ సెలూన్లకు తరచుగా వస్తున్నారంటూ వారు చెబుతున్నారు.
ఫ్రెంచ్ సెలూన్ల శ్రేణికి చెందిన జీన్-క్లాద్ బిగ్విన్ (జేసీబీ) సెలూన్ ఒకటి ముంబయిలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి సెలూన్ ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఇక్కడికి వచ్చే వాళ్లలో సరాసరి రూ.10,000 ఖర్చు చేసే వాళ్లు ఉన్నారు. ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో ముంబయిలోని ఈ సెలూన్ కు వెళ్లే వారూ ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో బ్యూటీ సెలూన్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది కదూ.
విదేశీయానాలు చేసే వినియోగదారులైతే అంతర్జాతీయ సౌందర్య సాధనాలపై ఎక్కువగా మోజు కనపరుస్తున్నారు.