భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే కి స్వదేశం కూడా పంచ్ ఇచ్చింది. తన భర్తకు అమెరికా పౌరసత్వం ఉందని, తన ఇద్దరు పిల్లలు కూడా పౌరసత్వం పొందినట్టు మీడియాకు వెల్లడించడంతో విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో, అమెపై విజిలెన్స్ కేసు నమోదు చేసి తాజాగా విధుల నుంచి తొలగించి పక్కన బెట్టింది. నిన్నటి వరకు దేవయాని భారత విదేశాంగ శాఖలో అభివృద్ధి భాగస్వామ్య డివిజన్ లో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో శాఖాపరంగా విచారణ కొనసాగనుంది. గతేడాది అమెరికాలో తన పని మనిషి కోసం వీసా దరఖాస్తులో దేవయాని తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో అభియోగాలు నమోదు చేసిన యూఎస్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం, అనంతరం అక్కడి నుంచి దేవయాని భారత్ చేరుకోవడం తెలిసిన సంగతే. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించి ఆమె మరోమారు ఇక్కడా కూడా వివాదాస్పదమయ్యారు.