వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో కెక్కుతున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురౌతున్నాయి. నేతలను అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీకి, నాయకులకు ఇబ్బందికరంగా తయారవుతాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇకపై పార్టీకి నష్టం కలిగించేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఆయన మాంజీకి సూచించారు. మాంజీపై చర్యలు తీసుకునే అంశాన్ని పార్టీ అధినేత శరద్ యాదవ్ చూసుకుంటున్నారని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతేకాదు తాను దేశానికి కాబోయే ప్రధాని అని చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఆయన ఇలాంటి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా వార్త ప్రకారం దీనిపై జేడీయూ అధిష్ఠానం ఈ అంశంపై మాంజీ నుంచి వివరణ తీసుకుని మందలించినట్లు సమాచారం.