కాదేదీ కవితకు అనర్హం. తెలిసిందే... కాదేదీ రాజకీయ రచ్చకు అనర్హం. నేటీ మాట. పొలిటికల్ గేమ్ అడుకునేందుకు నేతలకు ఏ టాపిక్ అయినా ఓ అస్త్రం అయిపోతుంది. అగ్గిపెట్టె నుంచి ఎయిరో ప్లేన్ దాకా ఏది దొరికినా వదిలకుండా వివాదాస్పదం చెయ్యటంలో వారికి వారే సాటి. మహారాష్ట్రలో ఇప్పుడు మాంసం పై నడుస్తున్న ఓ వివాదం పెద్ద వ్యవహారంగా మారి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.
పర్యుషాన్ జైనులు పవిత్రంగా భావించే పండగ. వారి రిక్వెస్ట్ మేరకు మాంసం విక్రయాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే కొన్ని వివాదాలు రావటంతో ఎనిమిది రోజుల నిషేధాన్ని నాలుగు రోజులు చేసింది. దీనిపై శివసేన మండిపడుతోంది. ఎవరు ఏమి తినాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగగానే వ్యతిరేకించింది. వీరికి బాసటగా ఇప్పుడు నవ నిర్మాణ సేన జతకలిసింది. మాంసం విక్రయాలను తామే నిర్వహిస్తామని ప్రకటించింది కూడా. దాదర్ లో అగర్ బజార్ వద్ద మాంసం అమ్మకాలను ప్రారంభించేందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు సిద్ధమైపోతున్నారట. దీంతో ఇప్పుడు ముంబయిలో మాంసం విక్రయాల అంశం రాజకీయ రంగు పులుముకున్నట్లయ్యింది. మాంసానికి మతం రంగు పులుమి ఎక్కడ గొడవలు చేస్తారో అని ముంబయి అంతా ఇప్పుడు బిక్కపట్టుకుని ఉంది.