కశ్మీర్ లో మరోసారి కల్లోలం చెలరేగింది. ఓవైపు యుద్ధ సంకేతాలు అందడంతో అలర్టయిన భారత సైన్యం మరో భారీ విధ్వంస రచనను అడ్డుకోగలిగింది. గురువారం సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. సరిహద్దు గుండా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూక ప్రయత్నించగా, ఇండియన్ ఆర్మీ దాన్ని సమర్థవంతగా తిప్పి కొట్టింది.
రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో హంద్వారా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. అయితే ఈ దాడిలో భారత్ తరపు నుంచి ఓ జవాను కూడా ప్రాణాలు వదిలాడు. కాల్పుల అనంతరం సోదాలు నిర్వహించిన సైన్యానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దొరికింది. పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరకడంతో పెద్ద ఫ్లాన్ తోనే వారు దేశంలోకి చొరబడ ప్రయత్నించారని అర్థమౌతోంది. మరిన్ని ఉగ్రదాడులకు ఆస్కారం ఉన్నందున సరిహద్దులో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. సైన్యం సరిహద్దుగ్రామాల్లో జల్లెడ పడుతోంది. ఎప్పుడూ ఏం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.