అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడు. ఇది అందరికీ తెలుసు. అయితే దావూద్ ను లేపేసేందుకు గతంలోనే భారత్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిందట. కానీ, మన దేశం నుంచే కొన్ని శక్తులు ఆ శుభకార్యానికి అడ్డుతగిలాయన్నది ఇప్పుడు సంచలన సృష్టిస్తుంది. మాజీ హోం శాఖ కార్యదర్శి.. బీజేపీ నేత అయినా ఆర్కే సింగ్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనాత్మక అంశాల్ని చెప్పుకొచ్చారు.
ప్రధాని వాజ్ పేయ్ హయాంలో దావూద్ ను లేపేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఇందుకోసం పెద్ద మాస్టర్ ఫ్లాన్ నే రచించారు. అప్పుడు ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్ గా అజిత్ డోవెల్ ఉన్నారు.. ఇందుకోసం చోటా రాజన్ ముఠాకు చెందిన సభ్యులకే రహస్యంగా శిక్షణ ఇచ్చినట్లు సింగ్ చెప్పుకొచ్చారు. అయితే పోలీసుశాఖకు చెందిన ఉన్నతాధికారులు కొందరు దావూద్ కు అత్యంత సన్నిహితులు కావటంతో ఈ కోవోర్ట్ ఆపరేషన్ విషయం లీకయ్యింది. వారు ఈ విషయాన్నిదావూద్ కు చేరవేయటంతోపాటు శిక్షణ పొందుతున్న వారిని అరెస్ట్ చేసేలా పావులు కదిపారని చెప్పుకొచ్చారు.
అమెరికా పాక్ లో ఉన్న లాడెన్ ఎలా అయితే లేపేసిందో.. అదే తీరులో దావూద్ ను లేపేయాలని ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అలాంటి ఆపరేషన్ అయితే పాక్ తిరిగి మన మీద దాడి చెయ్యొచ్చని భారత్ భావిస్తుందని, అందుకే మట్టుపెట్టేందుకు వెనకాడుతుందని ఆయన చెప్పారు. ఒకవేళ పాకిస్థాన్ కానీ.. నిజంగా యుద్ధానికి దిగితే.. దానిని ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉందని ఆయన వెల్లడించారు.
ఏదేమైనా వందల మంది మనుషుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న మానవ మృగాన్ని మట్టుపెట్టేందుకు భారత్ చేసిన ప్రయత్నానికి కొన్ని సొంత చేతులే అడ్డుతగిలాయన్న వార్త ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆగ్రహాం తెప్పిస్తుంది