అంతర్జాతీయ క్రికెట్ ను ఓ కుదుపు కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారించిన ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్న కొన్ని పేర్లను సుప్రీం కోర్టు శుక్రవారం వెల్లడించింది. ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్, ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్, క్రికెటర్లు స్టువర్ట్ బిన్నీ , ఓవైషా, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, ఐపీఎల్ అధికారి సుందర్ రామన్ ఉన్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడం కలకలం రేకెత్తించింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను అరెస్ట్ చేయగా, వారిలో క్రికెటర్లు, ఐపీఎల్ అధికారులు ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేయడానికి ముద్గల్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ముద్గల్ కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.