పార్లమెంట్ శీతకాల సమావేశాలలో నల్లధనం పై తీవ్ర చర్చ జరుగుతున్న తెలిసిందే. వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తానన్న ప్రధాని మోదీ ఇప్పుడా విషయంపై కిక్కురుమనకుండా ఉన్నారని విపక్షాలు కేంద్రప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి. ఇక ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభలో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల తొలిరోజు నల్లటి గొడుగులతో నిరసన తెలిపిన ఎంపీలు, గురువారం నల్లటి శాలువలు కప్పుకు వచ్చి తమ నిరసన తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నొత్తరాలు చేపట్టారు. వెంటనే నల్లటి శాలువాలు ధరించిన తృణమూల్ సభ్యలు సభలోకి ప్రవేశించారు. విదేశాల నుంచి బ్లాక్ మనీని వెంటనే వెనక్కు రప్పించాలని నినాదాలు చేస్తూ వాళ్ల వాళ్ల సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు.