మహిళలపై జరుగుతున్న దారుణాలకు కారణం ఏంటంటే వాళ్ల వస్ర్తధారణే అని ఒక రకంగా వాదించేవాళ్లు ఉన్నారు. ఆడవాళ్ల వస్ర్తధారణ బాగుంటే అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి అన్నదే వారి వాదన. అయితే ఇప్పుడు ఇదే వాదనను ఒక మహిళా మండలి బలపరుస్తోంది. నవీ ముంబైలోని గోఠివలి గ్రామంలో మహిళలు బయటికి వెళ్లేటప్పుడు గౌన్లు (నైటీలు, మ్యాక్సీలు) వేసుకోవడంపై అక్కడి ఇంద్రాయణి మహిళా మండలి నిషేధం విధించింది! అంతేకాదు, గోఠివలి గ్రామ మహిళలు ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో గౌన్లు ధరించి కనిపిస్తే వారి నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తామని కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా ఈ ఆదేశాలను గ్రామ కూడలిలో ఒక పెద్ద బోర్డుపై రాసిపెట్టింది. ఈ విచిత్ర ఆదేశాలతో ఒక్కసారిగా నవీముంబైలోని గోఠివలి గ్రామం వార్తల్లోకి వచ్చింది. అయితే ఇంద్రయాణి మహిళా మండలి సభ్యులు మాత్రం తాము చేసింది సబబేనని చెబుతుండగా మరోవైపు అనేకమంది ఈ ఏకపక్ష ధోరణిని తప్పుబడుతున్నారు. గ్రామంలో అత్యధికంగా ఆగ్రీ సమాజ్ కు చెందినవారే నివసిస్తున్నారు. ఈ సమాజ్ వారితో కలిసి గ్రామంలోని మహిళలందరు గతంలోనే ఇంద్రయాణిని స్థాపించుకున్నారు. తరచు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఈ మహిళా మండలి సభ్యులు తాజాగా నవీ ముంబైతో పాటు తమ రాష్ట్రంలో, ఇంకా దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాల సంఘటనలను అడ్డుకోవడం ఎలా అనే విషయంపై సమాలోచనలు జరిపారు. పర్యవసానమే గౌన్లు, నైటీల నిషేధం.