సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ నటులు రాజకీయాల్లో రాణించిన వారు చాలా తక్కువే అని చెప్పాలి. అంచనా వేసి అసలు ఆ వైపు అడుగులు వేయకుండా తమ జాగ్రత్తల్లో ఉండేవారు కొందరు. క్రేజ్ ను వాడుకొని ఎంటర్ అయ్యాక వాటి లోతు తెలుసుకొని బాధపడేవారు మరికొందరు. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం రెండో కేటగిరిలోనే చేరిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్ బీ అన్నారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అమితాబ్, మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లోని తన భావోద్వేగాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని, నిజ జీవితానికి, భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుందని తర్వాత తెలుసుకున్నానని మనుసులో మాట బయటపెట్టారు.