ఆసీస్-భారత్... భాయ్-భాయ్

November 19, 2014 | 11:14 AM | 34 Views
ప్రింట్ కామెంట్

ఆస్ట్రేలియాతో భారత్ పలు అంశాల్లో విస్తృతస్థాయి ఒప్పందాలను కుదుర్చుకుంది. రక్షణ, సైబర్, తీర గస్తీ, అణువ్యాప్తి నిరోధం తదితర అంశాల్లో భద్రతా సహకారంపై ఫ్రేమ్‌వర్క్ రూపకల్పనకు ఇరు దేశాలూ అంగీకారానికి వచ్చాయి. ఉగ్రవాదంపై పోరు, విదేశీ ఉగ్రవాద గ్రూపులను ఎదుర్కొనడంపై పరస్పర సహకారానికి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. సామాజిక భద్రత, ఖైదీల మార్పిడి, మాదకద్రవ్యాల నిరోధం, పర్యాటకంతో పాటు కళలు, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి కుదుర్చుకున్న ఐదు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వచ్చే ఏడాది చివరికల్లా కుదుర్చుకోవాలని, పౌర అణు ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కొలిక్కి తేవాలని ఇరు దేశాధి నేతలు అంగీకారానికి వచ్చారు. అక్రమ వలసలు అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటికే ఉగ్రవాదంపై పోరు కోసం ఏర్పడిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ పేరును మార్చేందుకు నిశ్చయించారు. సమావేశం అనంతరం ఇరువురు ప్రధానులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని తన సోదరుడిగా భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని మోదీ ఈ ఉదయం ఫిజీ చేరుకున్నారు. బుధవారం ఆ దేశ ప్రతినిధులతో జరిగే చర్చలలో ఇరుదేశాల ఒప్పందాలపై సంతకం చేయనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ