కాలం చెల్లిన ఔషధాలు వాడితే దుష్ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఏకంగా అవి వికటించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇకపై ఇలా ఎవరైనా ఎక్సపెయిరీ అయిన మందులు అమ్మాలని చూస్తే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టింది. ఔషధాల ప్రతికూల ప్రభావంపై 18001803024 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని అడ్వెర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సెంటర్లు పరిశీలించి జాతీయ సమన్వయ కేంద్రానికి పంపుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈ పరిశీలన ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలతోనూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ పంచుకుంటుంది. కాగా, ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను మెడికల్ షాపులు, క్లినిక్ లు, ఆసుపత్రుల్లో తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది.