పిడుగుపాటును ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటంతోపాటు సంభవించే మరణాలకూ ప్రభుత్వం త్వరలో నష్టపరిహారం చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి, కేంద్ర హోంమంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి అల్రెడీ ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదం లభించిన పక్షంలో పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభిస్తుంది. దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 400 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ వైపరీత్యాల సహాయ నిధినుంచి, వివిధ రాష్ట్రాల వైపరీత్యాల సహాయ నిధులనుంచి పిడుగుపాటు మరణాలకు పరిహారం అందే విధంగా, పిడుగుపాటు సంఘటనను వైపరీత్యాల జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వశాఖ 14వ ఆర్థిక సంఘానికి సమర్పించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి పిడుగుపాటు దుర్ఘటన, పరిహారానికి అర్హమైన ప్రకృతి వైపరీత్యాల జాబితాలో లేదు. కాగా, అందిన ప్రతిపాదనలపై 14వ ఆర్థిక సంఘం ఈ నెల 31లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి.