రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా జరుగుతున్నాయి. లోక్ సభలో నల్లధనం అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని టీఎంసీ తోసహా పలు పార్టీలు గోలచేశాయి. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమని, పదేళ్ల హయాంలో యూపీఏ ప్రభుత్వం నల్లధనంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. చర్చకు సిద్ధమన్నప్పటికీ ఆందోళన చేస్తున్న విపక్షాల వైఖరిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుబట్టారు. అయినా గందరగోళం నెలకొనడంతో సభను కొద్ది సేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే తీరు కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చడంపై జరుగుతున్న ఆందోళన సెగ పెద్దల సభను వేడేక్కించింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు ఆందోళన చేపట్టారు. దాంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.