యూపీలో ‘భారీ’ అవినీతి ఇంజినీర్

November 29, 2014 | 03:18 PM | 42 Views
ప్రింట్ కామెంట్

అప్పట్లో మైనింగ్ స్కాంలో గాలి జనార్థన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు బంగారు బాత్ టబ్ లాంటి కొన్ని షాకిచ్చే వస్తువులు దర్శనమిచ్చాయి. పదవిలో ఉన్నవారు ఇలా చేయడమంటే ఓకే కానీ ఓ ఇంజినీర్ అధికారి ఇలాంటి వాటానికి ప్రయత్నించాడంటే కాస్తా నమ్మలేని విషయమే కదా. దీనిని నమ్మాలంటే ఉత్తరప్రదేశ్ కు వెళ్దాం పదండి. యూపీలో ఐటీ సోదాల్లో భాగంగా అధికారులకు ఓ భారీ అవినీతి తిమింగలం దొరికింది. ఆయన ఇంట్లో 100 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, 10 కోట్ల రూపాయల నగదు చూసిన అధికారులే నోరెళ్లబెట్టారు. తనిఖీలు చేసిన కొలదీ వజ్రాలు బయటపడడంతో షాకవడం . నోయిడాలోని సెక్టార్ 51లో వుంటున్న ఈ ఇంజనీరు పేరు యాదవ్‌‌సింగ్‌. లగ్జరీ బంగ్లా, దాని చుట్టూ గార్డెన్, ఇంటి ఆవరణలో ఆడీ కార్లు ఇలా అన్ని హంగులతో రెడీ చేసుకున్నాడు. దీనికితోడు హోదా కూడా అటువంటిదే అనుకోండి. నోయిడా, గ్రేటర్ నోయిడా, యమున ఎక్స్‌ప్రెస్ వే వంటి అథారిటీలకు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దాదాపు 100 మంది అధికారులు... నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఆయన ఇళ్లు, సమీప బంధువుల 20 ఇళ్లపై ఏకంగా ఈ దాడులు చేశారు. ఇందులో 10 కోట్లు నగదు, డైమండ్స్- గోల్డ్ కలిసి(100 కోట్లు) రెండు కిలోలు దొరికాయి. యాదవ్ తన నివాసంలో పార్క్ చేసిన కారులో ఎనిమిది సంచుల్లో నగదు ఉంచాడు. ఇప్పుడు పట్టుబడినదంతా ఒక్కరోజు తనిఖీల్లో బయటపడినది మాత్రమే! కొన్నిరోజులు సోదాలు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు 13 బ్యాంకు లాకర్లు, కోల్‌కతా స్థావరంగా 35 నకిలీ కంపెనీలను యాదవ్ సృష్టించినట్టు తేలింది. డబ్బు సంపాదనలో తనకున్న అధికారాలన్నింటినీ ఈ ఇంజనీర్ బాగానే ఉపయోగించుకున్నాడు. ఎవరికైనా కేటాయించిన ప్రాజెక్టుల్లో యాదవ్ ఐదుశాతం కమిషన్‌గా పుచ్చుకునేవాడట. ఎక్కడైనా ల్యాండ్ కనపడడమే తడవు, ఎలాగైనా చేజిక్కించుకోవడానికి ఆరాటపడేవాడని దిగువస్థాయి అధికారులు చెబుతున్నారు. ఐటీ సమాచారం మేరకు దాదాపు 900 కోట్ల కుంభకోణానికి ఈ సార్ గారే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని కొన్ని చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇందులో ఓ ఇంజనీర్ నకిలీ పేర్లతో కంపెనీలను సృష్టించినట్టు తేలింది. ఈ క్రమంలో తీగలాగితే డొంక కదిలింది సదరు ఇంజనీర్ గారి భాగోతం బయటపడింది. ఈ వ్యవహారంపై అధికారులు దాదాపు 12 గంటలపాటు అన్నికోణాల్లో సమాచారం సేకరించి శుక్రవారం దాడులు మొదలుపెట్టారు. భారీస్థాయిలో అవినీతికి పాల్పడిన ఇంజినీర్ యాదవ్‌సింగ్‌పై ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఈయన గారు మాజీ ముఖ్యమంత్రి మాయావతికి దగ్గరి బంధువని తేలడంతో ప్రభుత్వం కనికరం చూపే ప్రసక్తే లేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ