కొత్త కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ శంకర్ కతేరియా ఫోర్జరీ వివాదంలో చిక్కుకున్నారు. తప్పుడు డిగ్రీ మార్కుల జాబితాతో ఫోర్జరీకి పాల్పడినట్టు ఆయనపై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఫోర్జరీ మార్కుల జాబితాకు సంబంధించి 2010లో కతేరియాపై పోటీ చేసిన బీఎస్‌పీ అభ్యర్థి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు ఆగ్రా సెషన్స్ కోర్టుకు రిఫర్ చేసింది. ఇక ఈ కేసు ఈ నెల 26న విచారణకు రానుంది. అయితే ఆరోపణలను మంత్రి కతేరియా కొట్టిపారేశారు. అప్పట్లో అధికారంలో ఉండగా బీఎస్‌పీ ప్రభుత్వం తనపై రోజుకు నాలుగు కేసులు పెట్టేదన్నారు. వాటంన్నింటిని నుంచి తాను బయటపడ్డానని, ఇప్పుడు దీని నుంచి కూడా బయటపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు.