దేని వదలకుండా వాడుకోవటంలో భారతీయులను మించిన వారు లేరనిపిస్తోంది ఈ వార్త వింటుంటే. చదివాక మీకు ఆ ఫీలింగ్ కలుగుతుందండోయ్... ఓ పక్క జనాలు రోగాలతో చస్తుంటే ఆ అవకాశాన్ని కూడా వాడుకోవాలని చూడటం, నిలువుదొపిడీ చెయ్యటం నిజంగా మనోళ్లకే సొంతమేమో.
ఢిల్లీలో ఇప్పుడు డెంగ్యూ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. మరణాలు ఏం సంభవించకపోయినా ఇప్పటిదాకా 141 కేసులు నమోదవటం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అక్కడి మేకల యజమానులు. మేకపాల పేరుతో అందినంత డబ్బును పిండేస్తున్నారు
సంబంధం ఏంటంటారా? మేకపాలు తాగితే రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరిగుతుందని నాటు వైద్యులు సలహా ఇస్తున్నారట. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి డెంగ్యూ దరికి రాదని, వచ్చిన వారికి కూడా మందులా ఇది పని చేస్తుందని వారు చెప్పుతున్నారట. దీంతో ఇదే అదనుగా భావించిన మేక యజమానులు పాలకు డిమాండ్ పెంచేశారట. ఇప్పుడక్కడ మేక పాల రేటు లీటర్ కు 2 వేలు. సాధారణ రోజుల్లో రేటు ఎంతో తెలుసా కేవలం 40 రూపాయలు మాత్రమే. కానీ, మేకలు చాలా వరకు చూలు దశలో ఉన్నాయని సొల్లు కారణాలతో దొచుకుంటున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది. లేక జనాలను వారు బకరాలను చేస్తున్నారా? నిర్ధారించాల్సింది వైద్యులే. ప్రజల జేబులకు చిల్లులు పడకుండా ఆపాల్సింది వారే.