శనివారం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పన్నుల ఎగవేత ఆరోపణలపై ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఉన్న సహారా సంస్థ కార్యాలయాల్లో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ హఠాత్తుగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు రూ. 135 కోట్ల నగదుతోపాటు భారీ ఎత్తున్న నగలు, డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కోర్టు కేసులతో సతమతమవుతున్న సహారాకు ఇది పెద్ద షాకే. అయితే సెబీ నిబంధనలు ఉన్నందున భారీ ఎత్తున్న సోమ్మును నిల్వ చేయాల్సి వచ్చిందని సహారా సంస్థ యాజమాన్యం చెబుతుంది. ఇక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ (ఈడీ) ను ఐటీ శాఖ కోరనుంది. ఈడీ ఈ ఏడాది మార్చిలో సహారా గ్రూప్ యాజమాన్యంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సహారా ఛీఫ్ సుబ్రతా రాయ్ తోపాటు ఇద్దరు డైరక్టర్లను ఈడీ అదుపులో తీసుకుని విచారించింది కూడా. ఈ మధ్య జరిగిన ఐటీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో సోమ్ము దోరకడం విశేషం. డబ్బునంతా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ కు తరలించినట్లు తెలుస్తోంది.