తాను పెంచిన పాము కాటుకు తానే గురైనట్టు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే పాకిస్థాన్ చివరికి దాని పంజాకే గాయపడింది. పాకిస్థాన్ పెషావర్ లోని ఓ ఆర్మీ పాఠశాలలో ఉగ్రవాదులు విరుచుకుపడి 141 మందిని చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. . దుశ్చర్యపై ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో కలిసివస్తామని ఆయన షరీఫ్ కు తెలిపారు. కాగా ఉగ్రహోమ జ్వాలలో బలైన చిన్నారుల ఆత్మశాంతి కోసం బుధవారం దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాలని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తాలిబన్ల కిరాతకానికి బలైన వందలాది విద్యార్థుల ఆత్మశాంతి కోసం భారత్ లో పాఠశాలలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాయి. వడోదరలో ఓ విద్యార్థి మాట్లాడుతూ, అమాయకులైన విద్యార్థులను చంపేశారని, పెషావర్ ఘటన విని విషాదంలో మునిగిపోయామని తెలిపాడు. చనిపోయిన వారిలో చాలా వరకు చిన్నారులే కావడంతో ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.