నేడు 105వ జయంతి: సేవల తల్లి థెరిసా...

August 26, 2015 | 12:52 PM | 4 Views
ప్రింట్ కామెంట్
motherteresa_niharonline

ఆల్బేనియా దేశానికి చెందిన ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (మదర్ థెరిస్సా) జన్మించి నేటికి 105 సంవత్సరాలు. భారత సౌరసత్వం పొంది మిషనరీస్ ఆఫ్ ఛారిటీని కోల్ కత్తాలో స్థాపించి పేదలకు తన సేవలను అందించిన మానవతా వాది. ఆమె పేదలకు, రోగ గ్రస్తులకు, అనాధలకు ఎంతో పరిచర్యలు చేసి అంతర్జాతీయ కీర్తిని పొందారు.  మే 24, 1931 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మత ప్రతిజ్ఞ చేసినప్పుడు మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డిలిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు. మే 14, 1937 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు. ఈమె మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1980లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందారు.  మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగ విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి, ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను, పాఠశాలలను స్థాపించింది. 1943లో కోల్‌కత్తాలో కరువు సంభవించినపుడు తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేద ప్రజలను చూసి ఆమె చలించిపోయారు. ఇంటింటికీ వెళ్లి రొట్టెలు, పాలు అందించి పేదల ఆకలి తీర్చారు. రోగులకు మందులు అందించి తన మానవతను చాటుకున్నారు. కోల్‌కత్తాలో నిర్మల్‌ హృదయ పేరిట అనాథాశ్రమాన్ని నిర్మించారు. ప్రపంచం మొత్తం పర్యటించి, పేద ప్రజలకు సేవ చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నారు. మదర్‌థెరిస్సా శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళి అక్కడి లెప్రసీ కాలనీలో పర్యటించి, కుష్టురోగులకు దుప్పట్లు అందజేశారు. ఆమె ప్రపంచ ప్రజలకు సుదీర్ఘ సేవ అందించి, సెప్టెంబర్‌ 5, 1997న మృతిచెందారు.

అయితే ఇంత సేవా భావం గల మదర్ థెరిస్సా కూడా విమర్శలను ఎదుర్కోవడం విచారం కలిగిస్తుంది. మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం, మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కోవాల్సి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ