ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో విచారణ చేపట్టిన ముద్గల్ కమిటీ ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏమీ లేదని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అయితే వ్యవహారం తెలిసినప్పటికీ ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనందున శ్రీనివాసన్ ను విచారించాల్సి మాత్రం ఉంటుందని కమిటీ తెలిపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్గల్ నివేదికలోని 13 మంది పేర్లను ఇటీవలె సుప్రీం కోర్టు వెలువరించింది. అందులో శ్రీనివాసన్ తోపాటు ఆయన అల్లుడు గురునాథ్, రాజస్థాన్ రాయల్స్ సహా యజమాని రాజ్ కుంద్రా పేర్లు కూడా ఉన్నాయి. దీనిపై బీసీసీఐ ప్రతినిధి రాజీవ్ శుక్లా స్పందిస్తూ... ‘శ్రీనివాసన్ పై గతంలో కూడా ఎలాంటి ఆరోపణలు లేవు. అలాగే నివేదికలో ఉన్న పేర్లలో శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్, నటి శిల్పాశెట్టి భర్త రాజస్థాన్ సహా యజమాని రాజ్ కుంద్రా ఈ అవినీతిలో భాగస్వాములని రిపోర్ట్ సాక్ష్యాధారాలతో తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే స్పందిస్తాం’ అని ఆయన తెలిపారు. అయితే పేర్లను వెల్లడించిన మూడు నాలుగు రోజుల్లోనే శ్రీనివాసన్ కు కమిటీ క్లీన్ చిట్ ఇవ్వడం పలు సందేహాలకు తావునిస్తుంది.