చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ కు వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఆ జట్టుకు కెప్టెన్ గా ఎలా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణ సందర్భంగా గురువారం కోర్టు ఈ మేరకు ధోనీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్ యజమానులెవరో చెప్పాలంటూ శ్రీనివాసన్ తరపు న్యాయవాదిని నిలదీసింది. సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు శ్రీనివాసన్ తరపు న్యాయవాది కాస్త తటపటాయించారట. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఏకంగా ఐపీఎల్ నుంచి తొలగించాలని అత్యున్నత నాయస్థానం ఆదేశించింది. ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొత్తం వివాదం అంతా చెన్నై ఫ్రాంచైజీ చుట్టూ తిరుగుతోందని అభిప్రాయపడ్డ కోర్టు, అసలు ఆ జట్టును తప్పిస్తే ఓ పనయిపోతుంది కదా అని ఐపీఎల్ నిర్వాహకులకు సూచించింది.