శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో అరెస్టైన సస్పెండెడ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. శుక్రవారం ఉదయం తన లాకప్ లో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించిన జైలు సిబ్బంది హుటాహుటిన ఎస్.ఎస్.కే.ఎం ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ సీఎంతో మమతా బెనర్జీతో సహా పలువురు ప్రముఖులపై ఈ కేసులో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం లేదంటూ గత కొంతకాలంగా కునాల్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు నిష్పక్షపాతంగా ఉండాలని సీబీఐని డిమాండ్ చేస్తున్నారు కూడా. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ కునాల్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు ఆయనకు నిద్రమాత్రలు ఎలా వచ్చాయనే అంశంతోపాటు సమగ్ర ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది.