అతనో మంచి దొంగ. చోరీ చేశాడు.. తిరిగి డబ్బు ఇద్దామని వచ్చాడు. కానీ, లోకం పాడుది కదా. నిర్దాక్షిణ్యంగా అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పింది. ఆసక్తికరమైన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ నెల 14న చెన్నైలోని పుదుకొట్టై పెరియార్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఎంప్లాయి రాజమాణిక్యం అవసరాల నిమిత్తం బ్యాంకు నుంచి 5 లక్షలు డ్రా చేసి ఇంటికొచ్చాడు. అయితే అతనికి తెలీకుండా ఓ వ్యక్తి (దొంగ) అతన్ని ఫాలో అవుతూ వచ్చాడు. ఇంటికొచ్చిన మాణిక్యం డబ్బు సంచి భార్యకు ఇచ్చి బయటకు వెళ్లాడు. ఇదే సమయంలో ఆ దొంగ మంచి నీళ్లు కావాలని ఆమెను అడిగాడు. ఆమె లోపలికి వెళ్లగానే బ్యాగ్ తో సహా ఉడాయించాడు. విషయం అర్థమైన దంపతులిద్దరూ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే...
ఈ నెల 26 న అదే వ్యక్తి రాజమాణిక్యం ఇంటికి వచ్చాడు. తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను ఆ పనికి ఒడిగట్టానని, ఇందులో 50 వేలు ఖర్చుచేశానని, అయినా తన తల్లి చనిపోయిందని, ఖర్చైన డబ్బుకు ప్రతీగా తన ద్విచక్రవాహనం ఉంచుకోవాలని చెప్పి బయటకు వెళ్లబోయాడు. కానీ, దొంగ దొంగేకదా... చుట్టుపక్కల వారి సాయంతో అతగాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఆ దంపతులు. ప్రస్తుతం ఖాకీలు అతన్ని విచారిస్తున్నారు. ఆ మంచి దొంగ పేరు మన్సూర్ (20) తిరుచ్చిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడట. ఎలా చేసినా దొంగ దొంగే... దొంగతనం దొంగతనమే.