బ్రిటిషోళ్లు రెండు శతాబ్దాలు మనల్ని ఏలితే ఏలారు. ఆ తర్వాత గాంధీ కర్ర (శాంతి) దెబ్బకు పారిపోయారనుకోండి. పోతే పోయారు కానీ, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రాన్ని.. నెమలి సింహాసనాన్ని పట్టుకుని పారిపోయారు. తాజాగా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న డిమాండ్ కోహినూర్ ఇండియాకు వస్తే ఎంత బావుండును అని...
అదేమంత ఈజీ కాదు. చూస్తూ.. చూస్తూ కొల్లగొట్టిన అమూల్య సంపదను తెల్లోడు తిరిగి ఇచ్చేసే ఛాన్స్ లేదు. ఓ పాతికేళ్ల కింద కూడా ఇదంతా పగటి కలగా.. పనిమాలిన ఆలోచనగా ఉండేది. కానీ.. ఇప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రస్తుతం మోదీ ఉన్నాడు అన్న కారణం ఒకటి వినిపిస్తుంది.
పలువురు భారతీయులు ఈ విషయం మీద గత కొద్దికాలంగా తమ వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నవంబరులో ప్రధాని మోదీ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భారత్ కు చెందిన కోహినూర్ వజ్రాన్ని భారత్ కు ఇచ్చేయాలన్న వాదనను భారత సంతతికి చెందిన కీత్ వాజ్ చెబుతున్నారు. నిజానికి ఆయన ఇలాంటి వాదనను వినిపించటం ఇదే తొలిసారి కాదు. కాకుంటే.. ఈసారి ఆయన సరికొత్త ప్రతిపాదన చేశారు. బ్రిటన్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని మోడీకి కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు మోదీ పర్యటనను వినియోగించుకోవాలని ఆయన చెబుతున్నారు. అయితే ఆపని చేయగల సత్తా మోదీకి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వివిధ దేశాల పర్యటనలో ఆయా దేశాల అధ్యక్షుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు అందుకున్న మోదీకి బ్రిటన్ కోహినూర్ ను తిరిగిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.