పర్యావరణంలో మార్పుపై పోరాటానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ తరపున పూర్తి సహయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. పారిస్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో సమస్యలను ఎదుర్కోడానికి తగిన పటిష్ఠమైన, సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు. అంతేకాకుండా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని 14 దీవి దేశాల అధినేతల శిఖరాగ్ర సమావేశాన్ని శుక్రవారం ఇక్కడ ప్రధాని ప్రారంభించారు. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న ఈ దేశాలతో మరింత సన్నిహిత సహకారాన్ని ఏర్పర్చుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
‘ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్’ (ఎఫ్‌ఐపిఐసి) రెండవ శిఖరాగ్ర సమావేశంలో మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ న్యూఢిల్లీలోని భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య( ఫిక్కీ) కార్యాలయంలో ఎఫ్‌ఐపిఐసి వాణిజ్య కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సహాయం కన్నా వాణిజ్యం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పు కారణంగా పసిఫిక్ దీవులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడుతోందని ఆయన అన్నారు. దాదాపు 7500 కిలోమీటర్ల మేర ఉన్న భారత దేశ సముద్ర తీరానికి, 1300 దీవులకు కూడా అది ముప్పుగా పరిణమిస్తోందని ఆయన అంటూ, ఈ ఏడాది చివర్లో పారిస్‌లో పర్యావరణ మార్పుపై జరిగే సదస్సులో ఈ సమస్యకు ఒక స్పష్టమైన, సమర్థవంతమైన ఫలితం లభిస్తుందని మనం ఆశిస్తున్నామన్నారు. కాగా, సంస్కరించబడిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న చిన్నదీవి దేశాలకోసం ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించాలన్న డిమాండ్ విషయంలో భారత్ మీతో భుజం భుజం కలిపి పోరాడుతుందని మోదీ ఆ దేశాలకు హామీ ఇచ్చారు.