ఎదుటివారు ఎవరైనా ముందు మౌనంగా ఉండి, టైం వచ్చినప్పుడు తొక్కేయటంలో(మాటలతో) ప్రధాని నరేంద్ర మోదీని మించినవారు లేరు. బడా బడా నేతలు ఇప్పటికే మోదీ పంచ్ లను రుచి చూడగా, తాజగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఆ జాబితా లో చేరారు.
బీహార్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆమె మోదీ గాలి మాటలు (హవాబాజ్) చెబుతున్నారని విమర్శించింది. నల్ల ధనం అంశాన్ని హైలెట్ చేసుకుని ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ఇప్పుడు కిక్కురుమనకుండా ఉందని ఆమె ధ్వజమెత్తారు. అవినీతిపరుల చిట్టా విప్పి, ఆ ధనాన్ని వెనక్కి రప్పించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. ఇక దీనికి ప్రధాని కాస్త ఘాటుగానే స్పందించారు. నల్లధనాన్ని తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం విశ్వప్రతయ్నం చేస్తుంటే హవాలాబాజ్ (స్కామ్ లు చేసిన ప్రభుత్వం) అడ్డుకుంటోందని తనదైన శైలిలో పంచ్ లు వేశారు. గురువారం బోపాల్ లో 10వ హిందీ ప్రచార మహాసభలు జరిగాయి. వీటిని ప్రారంభించేందుకు వచ్చిన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి ఇతరులను విమర్శించాల్సిన అవసరం లేదని, తమలోని లోపాలను సవరించుకుంటూ వెళ్లిపోతామని తెలిపారు. అసలు నల్లధనాన్ని తీసుకువస్తే సమస్యల్లో పడేది వారే. దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉందని చమత్కరించారు. అవినీతికి పాల్పడినవారే సమాధానం చెప్పాలని అడగటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.