భారత ప్రధాని నరేంద్ర మోదీ బాల్యం నుంచే కష్టాలను చూస్తూ పెరిగాడు. వాటిని దాటుకుంటూ ఒక్కో మెట్టు ఎదిగి నేడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఎంత పెద్ద సమస్యైన చెదరని ఈ ధీశాలి కంటతడి పెట్టాడు. అది కూడా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ మూలంగా... ఎందుకంటారా? అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ తో ఆదివారం సంభాషించారట. ఈ సందర్భంగా ‘‘మీకు, మాకు చాలా సారూప్యత ఉంది. మనకు కుటుంబం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా కీలకం కదా?’’ అంటూ జుకెర్ బర్గ్ మోదీని ప్రశ్నించారట. దీంతో తనను పెంచడానికి తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్న మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు.
‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడిని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మేం అప్పుడు చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిమనిషిగా చేసేది. తన పిల్లలను పెంచడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో చూడండి. కేవలం ఒక్క నరేంద్ర మోదీ తల్లే కాదు, భారత్ లోని ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పెంచడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇఫ్పుడు 95 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన పనులను తనే స్వయంగా చేసుకుంటారు’’ అని మోదీ గద్గద స్వరంతో చెప్పారు. దేశానికి ప్రధాని అయితేనేం ఓ అమ్మకు కొడుకేగా...