బీహార్ లో తొలివిడత ఎన్నికలు దగ్గర పడుతుండటం, ప్రచారంకు గడువు ముగియనుండటంలో పార్టీలన్నీ త్వరపడుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో, సభలతో, ర్యాలీలతో హోరెత్తిపోతుంది. ఇక దేశ ప్రధాని మోదీ కూడా ప్రచార ర్యాలీల్లో మహకూటమి జనతాపరివార్ పై విరుచుకుపడున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ససారాంలో జరిగిన సభలో ఆయన మరోసారి ఫైరయ్యారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నామని చెబుతున్న నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ లు ఇన్నాళ్లు ఎందుకు కలవలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. కేవలం రాజకీయాల కోసమే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు తప్పా, రాష్ట్రాభివృద్ధి కోసం కాదన్నారు. ‘ఓట్లు వేయమని అడిగేందుకు నితీష్, లాలూలు మీవద్దకు వస్తే ప్రజలకు ఏమి చేశారని నిలదీయండి’ అంటూ బీహార్ ప్రజలకు మోదీ సూచించారు. కాగా, ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు పోటీ చేయట్లేదో ఎవరైనా అడిగారా? అని నరేంద్ర మోదీ ససారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రశ్నించారు.
ప్రచారంలో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఆయన, లాలూపై తనదైన శైలిలో ప్రశ్నలు వేసి, ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. లాలూ పలు కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్షను కూడా అనుభవించారని గుర్తు చేశారు. భారత న్యాయ వ్యవస్థ ఆయన్ను ఎన్నికల నుంచి బహిష్కరించిందని, ఆటువంటి వ్యక్తి పార్టీకి ఓట్లు వేయవద్దని ఆయన కోరారు. తక్కువ కాలంలో జితిన్‌రామ్ మాంఝీ సమర్థ పాలన ఎలా ఉంటుందో బీహారీలకు చూపించారని అభిప్రాయపడ్డ మోదీ, ఆయన పేదలను ఆదుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని వివరించారు. ఈ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వానికి శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. అన్నట్లు తొలిదఫా ఎన్నికలు అక్టోబర్ 12న జరగనున్నాయి.